Saturday 10 November 2012

నా అనుభవాలలో.. నా అనుభవాలతో... తణుకు.

పచ్చటి పొలాలు, పారే కాలువ, మధ్యలో రోడ్డు, టోలు గేటు.. దాటితే "వెల్కం టు తణుకు" అనే బోర్డు... ఇంకా పూర్తిగా ఊరు రాకముందే, వేరే ఊరి నుంచి వచ్చే కొడుకు కోసం ఊరి చివర నిలబడి చూసే అమ్మలా మా కాలేజి...

తణుకు, ఏలూరు, గూడెం, రావులపాలెం, రాజమండ్రి, నరసాపురం బస్సుల పరస్పర పలకరింపులు బస్సులలో నుంచి దిగే అమ్మాయిలు, అబ్బాయిలు.. వుమెన్స్ కాలేజిలో మనకి నచ్చిన అమ్మాయి వస్తుందో లేదో అన్న ఆదుర్దా, చూడలన్న ఆత్రుత
, మాట్లాడలన్న ఆకాంక్ష... రెడ్డి గారు చూస్తారేమో అన్న భయం, స్వరాజ్య లక్ష్మి గారు పెట్టే టెస్ట్ గురించి బెంగ, సంజయ్ గాంధీ గారి క్లాస్ ఉంటే నిద్ర., శ్రీ వాణి గారి క్లాస్ కోసం ఎదురు చూపులు.

లంచ్ అవర్ లో చేతులు మారే బాక్సులు, త్వరగా తినేసి ఆడిన టేబిల్ టెన్నిస్ ఆటలు, నచ్చని క్లాసులు ఉంటే బ్యాంక్ లో పని ఉందని తీసుకున్న పర్మిషన్లు, లంచ్ తీసుకురాని రోజు శ్రీదేవి హోటల్ నుంచి తెచ్చుకుని తిన్న చపాతీలు, సీనియర్లతో అడిన క్రికెట్ మ్యాచులు, క్లాస్ అమ్మాయిల ముందు హీరోయిజం, సీనియర్ అమ్మాయల ముందు అమాయకత్వం, జూనియర్ అమ్మాయిలతో విలనిజం.

5 సంవత్సరాలుగా వెల్దామనుకుంటూ వెల్లలేకపోతున్న NTR పార్కు, ముందుకి వెలితే కేశవ స్వామి గుడి, దాటిన తర్వాత వచ్చే కాటన్ బొమ్మ, కొత్తగా కట్టిన రిలయన్స్ షాపింగ్ మాల్, చిన్నగా ఉండే ప్రత్యూషా దియేటర్, తణుకుకే గుండె లాంటి నరేంద్ర సెంటర్. ముందుకు వెళ్తే మెడికల్ షాప్ లో ఉండే ఐసు, పళ్ళ బళ్ళు, 10 రూపాయలకే దొరికే లస్సీ, లస్సీ కన్నా తెల్లగా ఉండే దానిని అమ్మే అమ్మాయి, దాటి ముందుకు వెళ్తే బాయ్స్ స్కూల్ గ్రౌండ్, ఇంకా ముందు వెంకటేష్-కిరణ్-దుర్గారావు-గోపా
ల్ ఉండే రూం, దాంట్లో మేము ఆడిన పేకాటలు, చూసిన సినిమాలు చివరగా కంబైండ్ స్టడీలు.

నడిచి బయటకి వస్తే ఎప్పూడు తనలోకి రమ్మని ఆహ్వానించే వెంకటేశ్వరా సినిమా హాలు, చూసిన సినిమా బాగోక తలనొప్పి వస్తే, తగ్గించే మమత టీ కార్నర్. ఇంకా లోపలకి వెళ్తే పాలిటెక్నిక్ కాలేజి, కొత్తగా కట్టిన ఫ్లై ఓవర్, అది కట్టక ముందు ఎప్పుడూ ఉండే ట్రాఫిక్ జాం. ఎడమ వైపు రైల్వే స్టేషన్, కుడి వైపు బస్టాండ్.


కేవలం తణుకు అన్న మూడు అక్షారాలలో ఇముడ్చుకున్న బోలెడన్ని అనుభవాలు. ఇప్పుడు మాత్రం జ్ఞాపకాలు.

అక్కడ ఉన్నన్ని రోజులు మంచి ఉద్యోగం రావాలని కన్న కలలు, ఇప్పుడు వచ్చిన తర్వాత మళ్ళీ చదువుకుంటే బాగున్ను అనే తీరని కోరిక.
Thanks to Tanuku, for giving wonderful memories to me.